ఇక కార్పొరేట్‌ కరెంటే | భారమైన కొనాల్సిందే | చట్టంలో మార్పులు చేసిన కేంద్రం

By

Baburao Chigurupati:  ఇక కార్పొరేట్‌ కరెంటే!

*******************
–  భారమైన కొనాల్సిందే
-చట్టంలో మార్పులు చేసిన కేంద్రం
–  విదేశీ పెట్టుబడిదారుల కోసమేనని వివరణ
వ్యవసాయ చట్టాలతో పాటు ప్రజలకు భారంగా మారే విద్యుత్‌ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నెలల తరబడి రైతాంగం చేస్తున్న ఆందోళనలను నామమాత్రంగా కూడా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం అదేసమయంలో కార్పొరేట్లకు అనుకూలంగా పలు నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా విద్యుత్‌ రంగంలోనూ అటువంటి నిర్ణయానే తీసుకుంది. కార్పొరేట్లు ఏర్పాటు చేసే రెన్యూవబుల్‌ ఎనర్జీ (సాంప్రదాయేతర విద్యుత్‌) యూనిట్ల నుండి తప్పనిసరిగా విద్యుత్‌ను కొనుగోలు చేసి తీరాలని రాష్ట్ర ప్రభుత్వాలను, పంపిణీ సంస్థలను ఆదేశించింది. వీటన్నింటిని మస్ట్‌రన్‌ (తప్పనిసరిగా నిర్వహించాల్సిన) యూనిట్ల పేర్కొంటూ కేంద్రం ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు విద్యుత్‌ చట్టం 2003లో చేసిన సవరణలను శనివారం నోటిఫై చేసింది. రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగంలో నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధన కోసం పెట్టుబడిదారులను, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. దీంతో తక్కువ ధరకు లభించే విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పటికీ దానిని వినియోగించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. ధర ఎక్కువైనా కార్పొరేట్లు ఏర్పాటు చేసే విద్యుత్‌ సంస్థల నుండే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా ఈ భారం ప్రజలపై పడుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ ఒక్కటి మినహా….
మస్ట్‌రన్‌ పవర్‌ప్లాంటులుగా పరిగణించే రెన్యూవబుల్‌ ఎనర్జి విద్యుత్‌ యూనిట్ల ఉత్పత్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపడం కానీ, క్రమబద్దీకరించడంకానీ చేయకూడదని తాజా ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్‌ కొనుగోళ్లు సరఫరా ప్రాధాన్యతలు నిర్ణయించే మెరిట్‌ ఆర్డర్‌ డిస్పాచ్‌ ప్రకారంగానీ, లాభనష్టాలు పరిగణలోకి తీసుకునే ఇతర ఏ వాణిజ్య అంశాల ఆధారంగాకానీ ఈ ప్లాంట్లనుండి ఉత్పత్తిఅయ్యే విద్యుత్‌ను ఆపడం, క్రమబద్దీకరించడం చేయకూడదని ఆదేశించింది. విద్యుత్‌ గ్రిడ్‌లలో ఏర్పడే సాంకేతిక, భద్రతా కారణాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఈ ప్లాంట్లనుండి విద్యుత్‌ను తీసుకోలేకపోయినా కొనుగోళ్ల ఒప్పదం (పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ -పిపిఎ) ప్రకారం నష్టపరిహారం చెల్లించి తీరాలని ఆదేశించింది. అటువంటి అనివార్య సందర్భాల్లోనూ ఎలక్ట్రిసిటి గ్రిడ్‌ కోడ్‌ నిబంధనలను పాటించి తీరాలని పేర్కొంది. అదే సమయంలో ఉత్పత్తిదారులకు పవర్‌ ఎక్స్చేంజ్‌లో అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది.
సరఫరా ప్రణాళిక విభాగాలు రద్దు …

తాజా ఉతర్వులకు మూడు రోజుల ముందు ప్రాంతీయ విద్యుత్‌ కమిటీ (రీజనల్‌ పవర్‌ కమిటీస్‌)ల సరఫరా ప్రణాళిక (ట్రాన్స్‌మిషన్‌ ప్లానింగ్‌) విభాగాలను కేంద్రం రద్దు చేసింది. ఈ కమిటీలు తమ ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి, ధర, డిమాండ్లను బట్టి కొనుగుళ్లను క్రమబద్దీకరిస్తుంటాయి. ఈ తరహా విధానం దేశంలో రెన్యువబుల్‌ ఎనర్జీ అభివృధ్దికి ఉపయోగపడదని కేంద్రం పేర్కొంది. ఈ నెల 20 వ తేదిన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈస్ట్రన్‌, వెస్ట్రన్‌, నార్తరన్‌, సదరన్‌, నార్త్‌ ఈస్ట్రన్‌ పవర్‌ కమిటీల సరఫరా ప్రణాళిక విభాగాలు రద్దు అయ్యాయి. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రణాళికలకు అవకాశమే లేకుండా పోయింది.

ఎందుకోసం?

దేశంలో 2022వ సంవత్సరం చివరినాటికి 175 గెగావాట్ల రెన్యువబుల్‌ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, 250 నాటికి 450 గెగావాట్ల సామర్ధ్యానికి దీనిని పెంచుతామని కేంద్రం అంతర్జాతీయ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం తరువాతే దేశంలో ఆదాని, టాటా తదితర కార్పొరేట్‌ సంస్థలు ఈ రంగంవైపు అడుగులేశాయి. యూరప్‌ నుండి కూడా పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. ఇలా పెట్టుబడులు పెట్టే వారికి తాజా ఉత్తర్వులు ఉపయోగపడుతాయి.

మస్ట్‌రన్‌ అంటే…

అన్ని పరిస్థితుల్లోనూ గ్రిడ్‌కు విద్యుత్‌ను నిరాటంకంగా సరఫరా చేసే వాటిని మస్ట్‌రన్‌ యూనిట్లుగా భావిస్తారు. వీటి నుండి విద్యుత్ ఉత్పత్తిని ఆపడానికి వీలులేదు. దేశంలో బొగ్గు, గ్యాస్‌ మినహా ఇతర పద్దతుల్లో విద్యుత్‌ను ఉత్పత్తిచేసే అన్ని యూనిట్లను మస్ట్‌రన్‌ యూనిట్లుగా ఇండియన్‌ ఎలక్ట్రిసిటి గ్రిడ్‌ కోడ్‌ (ఐఇజిజి) పేర్కొంది. మన రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో రెన్యూవబుల్‌ ఎనర్జీని కొనుగోలు చేసే విషయంలో వివాదాలు ఏర్పడిన అనంతరం ఐఇజిజి ఈ నిర్ధారణ చేసింది. సాంప్రదాయేతర ఇంథన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తున్న సమయంలో పెట్టుబడిదారులకు నష్టభయం లేకుండా చేయడానికి ఈ తరహా నిబంధన అమలు చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారి కార్పొరేట్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నా వారి నుండి కొనుగోలు చేసి తీరాలని ఆదేశించడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో రానున్న సంవత్సరాల్లోనూ ఏర్పాటు చేసే కొత్త యూనిట్లకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.

బిల్లుల పరిస్థితి ఏమిటి?

విద్యుత్‌ కొనుగోళ్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ వినియోగదారుల పరిస్థితి ఏమిటి? చట్టంలో వచ్చిన మార్పుల ప్రకారం నెలవారి టారిఫ్‌ను లెక్కవేయడానికి నూతన విధానాన్ని అమలు చేయాలని కేంద్రం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like