ఐటీ హ‌బ్‌ల విస్తరణ.. త్వరలోనే ఆ జిల్లాలలో ప్రారంభం

ఐటీ హ‌బ్‌ల విస్తరణ.. త్వరలోనే ఆ జిల్లాలలో ప్రారంభం.
హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కు ఐటీని విస్త‌రించాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ముందుకు వెళ్తుంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ హ‌బ్‌ల‌ ఏర్పాటున‌కు విశేషంగా కృషి చేస్తున్నారు. త్రీ డీ మంత్ర‌లో భాగంగా జిల్లా కేంద్రాల్లో ఐటీ హ‌బ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ప్రపంచమంతా త్రీ‘డీ’.. అంటే, డిజిటైజేషన్‌, డీకార్బనైజేషన్‌, డీసెంట్రలైజేషన్‌ విధానంలో దూసుకుపోతోందన్నారు.
వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌లో ఐటీ హ‌బ్‌లు విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, సిద్దిపేట‌, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ త్వ‌ర‌లోనే ఐటీ హ‌బ్‌లు ప్రారంభ‌మవుతాయ‌ని ప్ర‌క‌టించారు. ఆయా జిల్లాల్లో ఏర్పాట‌వుతున్న ఐటీ హ‌బ్‌ల ఫోటోల‌ను కేటీఆర్ షేర్ చేస్తూ, ప‌నుల పురోగ‌తిని వివ‌రించారు.
నిజామాబాద్‌లో ఐటీ హ‌బ్ దాదాపు పూర్త‌యింది.. త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. ఐటీ హ‌బ్ కోసం కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్‌ను కేటీఆర్ అభినందించారు.
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోనూ ఐటీ హ‌బ్ పూర్త‌యింద‌ని, ఒక నెల రోజుల్లో ప్రారంభిస్తామ‌న్నారు. ఈ ఐటీ హ‌బ్ పూర్త‌య్యేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ విశేషంగా కృషి చేశార‌ని పేర్కొన్నారు.
సిద్దిపేట ఐటీ హ‌బ్ కూడా మంత్రి హ‌రీశ్‌రావు నేతృత్వంలో చ‌క్క‌టి నిర్మాణంతో రూపుదిద్దుకుంటుంద‌ని తెలిపారు. నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఐటీ హ‌బ్‌ల‌ను ప్రారంభించిన అనంత‌రం దీన్ని కూడా ప్రారంభిస్తామ‌ని చెప్పారు.
న‌ల్ల‌గొండ ఐటీ హ‌బ్ కూడా నిర్మాణంలో ఉంద‌ని, 4-6 నెల‌ల్లో పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ఈ హ‌బ్ నిర్మాణం పూర్త‌య్యేందుకు కృషి చేస్తున్న మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *